నల్లకుబేరులకు షాకిచ్చేలా కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాత నోట్ల మార్పిడిని నిలిపేసింది. 5 వందల రూపాయల పాత నోట్లతో ప్రభుత్వ సంస్థల ఫీజులు, బకాయిలను డిసెంబర్ 15వరకు చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 2 వరకు టోల్‌టాక్య్ రద్దును పొడిగించింది. కేంద్ర సర్కార్ తాజా నిర్ణయాలతో నోట్ల మార్పిడిలో జరుగుతున్న అక్రమాలకు తెరపడనుంది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడింది మొదలు.. బ్యాంకుల్లో ఒకటే క్యూలు. పాత కరెన్సీ మార్పిడికే అంతా మొగ్గు చూపారు. పైగా ఈ లైన్లలో అంతా సామాన్యులే. పెద్దలెవ్వరూ లేరు. మరి, బడాబాబుల దగ్గరున్న నల్లధనం ఏమైనట్టు? వైట్ చేసుకునేందుకు అడ్డదార్లు వెతుకుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. హడావుడి కాస్త తగ్గాక రంగంలోకి దిగుతారంటూ మరికొందరి వాదన. ఇటు పోస్టాఫీసుల్లో సైతం కొందరు షార్ట్‌కట్‌లు వెతికేశారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని GPO సహా 10 ప్రధాన పోస్టాఫీసుల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు చేయడంతో అక్రమాలు వెలుగు చూశాయి. ఒక్క హిమాయత్ నగర్ శాఖలోనే అరకోటి వరకు గోల్‌మాల్ జరిగినట్టు ప్రాథమిక అంచనా. అర్ధరాత్రి దాటేవరకు అక్కడే ఉన్న సీబీఐ అధికారులు.. బుక్కుల్లోని లెక్కల్ని నిగ్గుతేల్చే పని చేపట్టారు. బ్లాక్‌మనీ ముఠాలకు సహకారం అందినట్టు తేల్చారు. బడాబాబులకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా చేసేందుకు.. నోట్ల మార్పిడిని బంద్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. తమ దగ్గరున్న నోట్లను పేదలు మార్చేసుకున్నారని అంచనాకు వచ్చాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డిసెంబర్ 30 వరకు పెద్దనోట్ల ఖాతాల్లో వేసుకోవచ్చు. అంటే.. ప్రతి రూపాయికి లెక్క తేలుతుందన్నమాట. నల్ల కుబేరులకు ముసళ్ల పండుగే. అదే సమయంలో మరిన్ని ఉపశమన చర్యలను ప్రభుత్వం తీసుకుంది. జాతీయ రహదారులపై టోల్ ట్యాక్య్ రద్దు గడువును డిసెంబర్ 2 వరకు పొడిగించింది. ఇంటి వాటర్, కరెంట్ బిల్లులు, బకాయిలు, టోల్ ట్యాక్స్‌ను పాత నోట్లతో డిసెంబర్ 15 వరకు చెల్లించుకోవచ్చు. అయితే 500 నోట్లకు మాత్రమే అనుమతించారు. పాత వెయ్యి రూపాయల నోట్లను తీసుకోరు. పాత 500 నోటుతో ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్‌కు కేంద్రం అవకాశమిచ్చింది. సహకార సూపర్‌బజార్లలో పాత నోట్లతో కొనుగోళ్లను 5వేల వరకు పరిమితం చేసింది. ప్రభుత్వ పాఠశాల్లో, కాలేజీల్లో ఫీజులు కట్టవచ్చు. విదేశీయులు వారానికి 5 వేల వరకు విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు అనుమతిచ్చింది. కరెన్సీ కష్టాల నుంచి ఉద్యోగులకు హర్యాణా సర్కార్ ఊరట కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం డీఏ పెంచడంతో పాటు వచ్చే నెల వేతనంలో 10వేల చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది. పెద్ద నోట్ల రద్దుపై వ్యాపార దిగ్గజం రతన్ టాటా స్పందించారు. కష్టకాలంలో ప్రభుత్వం తమను విస్మరిస్తోందనే భావన ప్రజలకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Leave a Reply