విశాఖపట్నం.. ఇప్పుడిప్పుడే స్మార్ట్ సిటిగా మారుతోంది. దాంతో పాటే నగరంలో స్మార్ట్ ఫోన్‌లు వాడేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అసలు సమస్య అక్కడే మొదలవుతోంది. ఆపరేటర్ల మధ్య పోటీతో ఎక్కడపడితే అక్కడ సెల్ టవర్స్ నిర్మిస్తున్నారు. దీంతో రేడియేషన్ తమ ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
అవును దీన్నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు…మొబైల్ ఇంత ప్రమాదకరం అయితే.. సెల్ టవర్లు ఇంకెంత ప్రమాదకరంగా ఉంటాయో అన్న సందేహాలు సహజం. ఇప్పుడు ఇదే విశాఖలో కలకలం రేపుతోంది.
జనావాసాలకు 300 మీటర్ల అవతల మాత్రమే సెల్ టవర్లు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రేడియోషన్ ఎక్కువగా ఉంటే.. మతిమరుపు, డిప్రెషన్, తలనొప్పి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
విశాఖలోని కంచరపాలెం, రవీంద్రనగర్ లాంటి ప్రాంతాల్లో సెల్ టవర్స్ ఎక్కువగా ఉన్నాయి. కంపెనీలు ప్రజల నెత్తిన తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇటీవల రవీంద్ర నగర్‌లోని ఒక ఇంటిపై టవర్ నిర్మించాలన్న ప్రయత్నాలను జనాలు అడ్డుకున్నారు. కొందరు భవన యజమానులు అద్దెలకు కక్కుర్తి పడి అనుమతులు ఇస్తున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి.
ఇప్పటికే ఇళ్ల మధ్యలో ఉన్న టవర్లు తొలగించాలని ఫిర్యాదులు చేసినా సరే అధికారులు స్పందించడం లేదు. పిల్లలు, వృద్దులపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆటంబాంబులు లాంటి ఈ సెల్ టవర్స్‌ను జనావాసాల మధ్య తొలగించి శివారు ప్రాంతాలకు తరలించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. తమ ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.
అయితే సెల్ ఆపరేటర్లు మాత్రం స్థానికులతో విబేధిస్తున్నాయి. గతంలో ఇలాంటి అనుమానాలు వ్యక్తమైన నగరాల్లో ఆధునిక యంత్రాలతో పరీక్షించామని, ఎక్కడా సెల్ టవర్ల ద్వారా రేడియేషన్ ఉత్పన్నం కాలేదంటున్నారు.
Leave a Reply