మహేశ్‌బాబు. టాలీవుడ్ సూపర్‌స్టార్. అయితే.. ఇప్పుడు ఆయన్ను సూపర్‌స్టార్ అని అనడం లేదు. అందరూ.. శ్రీమంతుడే అంటున్నారు. సినిమా హిట్‌తో పాటు మహేశ్ సేవా దృక్పదంతో ఈ బిరుదు స్థిరపడిపోయింది. అందుకు కారణం.. తన స్వస్థలమైన బుర్రిపాలెంను దత్తత తీసుకోవడమే. సినిమాలో మాదిరి ఈ బుర్రిపాలెం బుల్లోడు తన ఊరిని మార్చేశాడా? శ్రీమంతుడు దత్తత తీసుకున్న గ్రామం ఇప్పుడెలా ఉంది? శ్రీమంతుడు. మహేశ్‌బాబు కెరీర్‌లోకే బిగ్గెస్ట్ హిట్. ఊరును దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం ప్రేక్షకులతో పాటు మహేశ్‌బాబునూ కదిలించింది. సినిమాల్లోనే కాదు.. తాను నిజ జీవితంలోనూ హీరోనేనని నిరూపించారు. విస్తృత కసరత్తు తర్వాత కార్యక్షేత్రంలోకి దిగిపోయారు..
బుర్రిపాలెం. సూపర్‌స్టార్ స్వగ్రామం. దశాబ్దాలుగా ఘట్టమనేని కుటుంబాన్ని ఆదరిస్తున్న గ్రామానికి.. ఎంతో కొంత తిరిగిచ్చేయాలని సంకల్పించాడు ఈ శ్రీమంతుడు. ఈ యేడాది మార్చి 17న గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఊరు మధ్యలో సభ పెట్టి.. తాను చేయదలుచుకుంది చెప్పారు. రంగులు, రోడ్లు వేసి వెళ్లిపోనని.. సమగ్రంగా అభివృద్ధి చేస్తానని ప్రజల సాక్షిగా ప్రకటించాడు. బుర్రిపాలెంను దత్తత తీసుకుని దాదాపు 8నెలలు కావొస్తోంది. ఇది చాలా తక్కువ సమయమే. ఇంత తక్కువ గడువులో పెద్ద పెద్ద మార్పులు ఆశించడం అత్యాశే. కానీ.. శ్రీమంతుడు మాయే చేశాడు. అచ్చం సినిమాల్లో మాదిరే.. ఊరు రూపురేఖలు మార్చేశాడు. తన సొంత డబ్బులతో పాటు ప్రభుత్వ సహకారంతో బుర్రిపాలెంకు నిధులు వరద పారిస్తున్నారు. ఊరికి విశాలమైన రోడ్లొచ్చాయి. మూలమూలన ఉన్న ఇళ్లను సైతం సిమెంట్ రోడ్డు వెతుక్కుంటూ వచ్చింది. రోడ్డ పక్కనే చక్కని సైడ్ కాలువలు.. ఇప్పటికే అనేకం పూర్తవగా.. ప్రస్తుతం పెండింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మురుగునీరు నిలవకుండా ఊరు బయటకు వెళ్లిపోతుండటంతో.. దోమలు లేవు.. రోగాలు లేవు..
శ్రీమంతుడి స్పూర్తితో మేము సైతమంటూ పలువురు దాతలు ముందుకొచ్చారు. ఊరంతా మొక్కలు నాటి.. వాటికి రక్షణగా ట్రీ గార్డులు అమర్చుతున్నారు. పొలాలకే పరిమితమైన పచ్చదనం.. ఇప్పుడు వాడవాడలా కనిపిస్తోంది. మహేశ్‌బాబు కృషితో బుర్రిపాలెం ఇప్పుడు భలేగా కనిపిస్తోంది.. ఊరిని దత్తత తీసుకున్న రోజే మహేశ్‌బాబు చెప్పినట్టు.. విద్య-వైద్యంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌కు అదనపు గదులు నిర్మించారు. దాతల సహాయంతో విస్తృతంగా హెల్త్‌క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రతీ ఒక్కరి పేరునా ఆరోగ్య కార్డులు రూపొందించారు. మహేశ్‌బాబు దంపతులు స్వయంగా హెల్త్‌కార్డ్‌లు అందించారు. తాగునీటి అవసరాల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అయితే.. బుర్రిపాలెం అభివృద్ధిలో మహేశ్‌బాబు బావ.. ఎంపీ గల్లా జయదేవ్ కృషి తక్కువేం కాదు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో అధికశాతం ఎంపీలాడ్స్ నిధులతోనే.. అభివృద్ధి అనేది సమగ్ర కోణంలో చూసే అంశం. ఊరిని దత్తత తీసుకొని ఎందరిలోనే స్పూర్తి నింపారు మహేశ్‌బాబు. ఇది అభివృద్ధి కంటే కూడా గొప్పదైన మార్పు. అందుకు ఉదాహరణే బుర్రిపాలెం. మహేశ్‌బాబుతో పాటు ప్రభుత్వం, ఎంపీ జయదేవ్, పలు ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు.. ఇలా అందరూ కలిసి మూకుమ్మడిగా గ్రామాన్ని ప్రగతిపథాన నడిపిస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి. మహేశ్‌బాబూ.. నువ్వు నిజంగా బుర్రిపాలెం శ్రీమంతుడివే..
Leave a Reply