500, వెయ్యి నోట్లు రద్దు చేస్తూ కేంద్రం చేసిన ప్రకటనను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఇది సరైన నిర్ణయమేనంటూ హర్షం వ్యక్తం చేశాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం కాస్త భిన్నంగా స్పందించాయి. కేంద్ర నిర్ణయం మంచిదేనని… ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే బావుండేదంటున్నారు నేతలు. పెద్ద నోట్లు రద్దు చేసుకోవాలన్న కేంద్రం ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. అయితే.. ఇది సరైన టైమ్ కాదని ఆ పార్టీ నేత రంజిత్ సుర్జేవాలా అన్నారు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన… ఇది ఆర్థిక సంస్కరణల దిశగా కీలక అడుగన్నారు. ఇది విప్లవాత్మక నిర్ణయమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెద్దనోట్లను రద్దు చేయాలని చంద్రబాబు ఎప్పటినుంచో చెప్తున్నారని మంత్రి పత్తిపాటి అన్నారు. నల్ల ధన నిరోధానికి ప్రధాని ప్రకటించిన నిర్ణయం సరైందనన్నారు తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్. విదేశాల్లో మన నోట్లను ముద్రించి దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్ర జరుగుతోందని… నల్లధనం ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరిందన్నారు. ఈ సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. అయితే ఇబ్బంది కలగకుండా నల్లధనంపై ఉక్కుపాదం మోపాలని కోరారు. 500, వెయ్యి కరెన్సీ రద్దుపై నిపుణులు సానుకూలంగా స్పందించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు ప్రముఖ విశ్లేషకులు పుల్లారావు. మోడీ సంచలన నిర్ణయంతో నల్ల కుభేరులకు షాకిచ్చారన్నారు. కేంద్ర నిర్ణయాన్ని బాబా రాందేవ్ స్వాగతించారు. మోడీ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
Leave a Reply