నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన దళితులపై దాడి కేసులో నిందితుడు భరత్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సుమారు నెల రోజులుగా పరారీలో ఉన్న భరత్ రెడ్డి నిజామాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిజామాబాద్ జిల్లా అబంగపట్నంలో మొరం అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు.. ఇద్దరు దళిత యువకులపై భరత్ రెడ్డి దారుణంగా ప్రవర్తించాడు. వారిని ఓ మడుగులోకి దించి.. అందులో మునగాలంటూ బెదిరించాడు.
తప్పయిపోయిందని…. ఇంకెప్పుడూ ప్రశ్నించబోమని ఆ బాధితులు కాళ్లావేళ్లాపడినా భరత్ రెడ్డి కనికరించలేదు. వారిని బెదిరిస్తూ… ఆ ఘటనను మొత్తం వీడియోలో రికార్డు చేశారు. అయితే, ఈ వీడియో మొత్తం వైరల్ కావడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో బాధితులైన దళితులు.. రాజేశ్వర్, లక్ష్మణ్‌లు కనిపించకుండా పోయారు. పోలీసులు, దళిత సంఘాలు ఎంతగా గాలించినా.. వారి జాడ తెలియలేదు. కట్‌చేస్తే.. 18 రోజుల తర్వాత హైదరాబాద్ పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు రాజేశ్వర్, లక్ష్మణ్. ఆ సమయంలో తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పిన బాధితులు.. తెల్లారేసరికి మాట మార్చేశారు. భరత్‌రెడ్డే తమను హైదరాబాద్‌కు తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడని గోడు వెళ్లబోసుకున్నారు. భరత్‌రెడ్డి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
భరత్ రెడ్డి వ్యవహారం తీవ్ర దుమారం రేగడంతో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. పోలీసులు కావాలనే అరెస్టు చేయడం లేదంటూ విమర్శలు వచ్చాయి. ఒత్తిళ్ల వల్లే భరత్ రెడ్డిని అరెస్టు చేయడం లేదని దళిత సంఘాలు ఆరోపించాయి. అయితే, ఎట్టకేలకు 20 రోజులతర్వాత భరత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు, ఇదంతా షార్ట్ ఫిలిం షూటింగ్‌లో భాగంగానే తీశామనే వాదన తెరపైకి వచ్చింది. తమ గ్రామం చుట్టుపక్కల ఇంకా పటేల్, పట్వారీ వ్యవస్థ నడుస్తోందని.. అలాంటి అంశాలను బయటకు తీసుకొచ్చేందుకే షార్ట్ ఫిలిం తీశామని భరత్ రెడ్డి వాదిస్తున్నాడు.
Leave a Reply