గుజరాత్ హోంమంత్రి ప్రదీప్ జడేజాకు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ముందు గోపాల్ అనే వ్యక్తి, హోంమంత్రిపై షూ విసిరాడు. షూ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు హోంమంత్రి. అయితే షూ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ హోంమంత్రి ప్రదీప్ జడేజా అసెంబ్లీ ముందు మీడియా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చారు. సరిగ్గా అప్పుడే గోపాల్ అనే వ్యక్తి గట్టిగా నినాదాలూ చేస్తూ చేతిలో షూ పట్టుకుని హోంమంత్రికి దగ్గరగా వచ్చాడు. మొత్తం మీడియా అంతా ఉన్న సమయంలో గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోపంగా తన షూలు తీసి విసిరాడు. రెప్పపాటులో ఆ షూ మంత్రికి తగలకుండా పక్కకు పడిపోయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. షూ విసిరిన గోపాల్‌ను కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలంటూ గతంలో హోంమంత్రిని కోరాడు. అయితే ఇంత వరకూ తన డిమాండ్ ను ఆమోదించలేదనే కోపంతో షూ దాడికి పాల్పడ్డాడని తెలిసింది. ఈ వ్యక్తి అంతకుముందు నిరుద్యోగ అంశంపై డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌తో కూడా మాట్లాడినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పాలనకు, అవినీతికి గుర్తుగా తన షూ ఇస్తున్నానని నినాదాలు చేస్తూ షూ విసిరి కొట్టాడు. గుజరాత్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వరుసగా అధికారం చేపడుతున్న బీజేపీ ప్రభుత్వానికి ఇలాంటి ఘటనలు వ్యతిరేకంగా మారుతున్నాయి.
Leave a Reply