జల్లికట్టు క్రీడ నిషేధంపై సమీక్షించాలని తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జల్లికట్టును రాష్ట్ర క్రీడగా గుర్తించడానికి ప్రాతిపదిక లేదని జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
తమిళనాట సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీర్పు వెలువరించింది. జల్లికట్టుపై 2014లోనే నిషేధం విధించిన సుప్రీం, తమిళనాడు వేసిన రివ్యూ పిటిషన్ ను తోసిపుచ్చింది. జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం ఈ రివ్యూ పిటిషన్ పై తీర్పు వెలువరించింది. 1960 ఎనిమల్స్ యాక్ట్ ను ప్రస్తావించింది. తమిళనాడు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శేఖర్.. 2009లో తమిళనాడు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, ఎద్దులకు ఎలాంటి నష్టం జరగకుండా జల్లికట్టు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. జల్లికట్టు అంటే జంతువులను హింసించడం కాదని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అటు జంతు సంరక్షణ బోర్డు తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. పండగలు హింసాత్మకంగా అస్సలు జరగకూడదంటూ వాదించారు. 1960 యానిమల్ యాక్టుకు, తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన 2009 చట్టానికి సంబంధం లేదన్నారు. వినోదం కోసం జంతువులను వాడుకోవడం కూడదంటూ సుప్రీం సూచించింది. జల్లికట్టుపై నిషేధంతో స్థానికుల ప్రాథమిక హక్కుకు భంగం కలుగుతోందన్న వాదనను సుప్రీం తోసిపుచ్చింది. ఆర్టికల్ 25ని, జల్లికట్టు నిషేధానికి ముడిపెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది. అదే సమయంలో గుర్రపు పందాలపై లేని నిషేధం జల్లికట్టుకే ఎందుకని తమిళనాడు ప్రభుత్వం తరపు లాయర్ ప్రశ్నించారు. జంతువులపై హింసను ఆపడమే 1960 యానిమల్ యాక్ట్ ఉద్దేశమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
Leave a Reply