కడప జిల్లాలో రాజకీయంగా మరో రసవత్తర ఘట్టానికి తెరలేచింది. వచ్చే ఏడాది జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు రంగంలో దిగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ముందస్తు అంచనాలు.. మంతనాల్లో బిజీ అయ్యారు. ప్రతిపక్షనేత సొంత జిల్లా కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార పార్టీ కూడా ఎలాగైనా విజయం దక్కించుకోవాలని తహతహలాడుతోంది. దీంతో కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి రసవత్తరంగా మారింది.
ప్రతిపక్ష నేత సొంత జిల్లా కావడంతో అదికార పక్షం ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది. విజయంపై వైసీపీ ధీమాగా ఉంది. ఓడిస్తామని అధికార పార్టీ అంటోంది. దీంతో జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ తరపున మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అభ్యర్ధిత్వం దాదాపు ఖరారు అయింది. ఇప్పటికే ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో స్థానిక సంస్థల నుంచి గెలుపొందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి ఇటీవలే టిడిపిలో చేరిపోయారు. దీంతో ఈ సారి వైసీపీ ముందుగానే జాగ్రత్త పడి వైఎస్ వివేకానందరెడ్డి పేరు ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా బలమైన అభ్యర్ధిని రంగంలో దింపనుంది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే నాయకుడ్ని గర్తించి బరిలో నిలపాలని నిర్ణయించారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏడాది ముందే ఆశావహులు ప్రచారం మొదలుపెట్టడంతో రాజకీయంగా సందడి నెలకొంది. అటు ప్రలోభాల పర్వం కూడా భారీగానే సాగుతోంది. ఇక జంప్ జిలానీలు కూడా భేరాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతుంది.
Leave a Reply