టీమిండియా వన్డే, టీ ట్వంటీ కెప్టెన్ బాధ్యతలనుంచి తనకు తానుగా తప్పుకున్న ధోనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మిస్టర్ కూల్ సెన్సేషనల్ డెసిషన్‌ను క్రీడా విశ్లేషకులు, మాజీ క్రికెటర్లతో సహా బాలీవుడ్ ప్రముఖులు కూడా మెచ్చుకుంటున్నారు. ధోనీ నిర్ణయానికి కాస్త ఆశ్చర్యపోయినా.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇప్పటికీ తగ్గని ఫిట్ నెస్.. మరికొన్నేళ్లపాటు లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌లో జట్టును లీడ్ చేయగల సత్తా ధోనీ సొంతం. అలాంటిది మహేంద్రుడు హఠాత్తుగా తన కెప్టెన్ పదవి నుంచి తప్పించుకోవడంతో క్రీడా ప్రపంచంతోపాటూ వ్యక్తిగతంగా ఆయన గురించి తెలిసిన అందరూ షాక్ అయ్యారు. అయితే ఇది మంచి నిర్ణయమేనంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కెప్టెన్‌గా కోహ్లీ అద్భుతాలు సృష్టిస్తుండడంతో జార్ఘండ్ డైనమెట్ మంచి నిర్ణయమే తీసుకున్నాడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ధోనీ కెప్టెన్‌గా తప్పుకున్నా ఆయన భార్య సాక్షి సింగ్ మాత్రం సంబరపడిపోయారు.. నువ్వు చేరని శిఖరాలు లేవంటూ నిన్ను చూసి గర్విస్తున్నా అంటూ ప్రేమగా ట్వీట్ చేశారు.. ఇటు ధోనీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంపై వెంగ్ సర్కార్ హ్యాపీ అయిపోయారు. క్రికెట్‌కు పూర్తిగా దూరమై ఉంటే మాత్రం అతడి ఇంటి ముందు ధర్నా చేసేవాడినని జోక్ చేశారు. ఇంగ్లాండ్‌తో టీ 20, వన్డే సిరీస్ ముందు భారత జట్టు ఫ్యూచర్ కోసమే ధోనీ ఇలా చేశాడని అభిప్రాయపడ్డారు.
ధోనీకి వచ్చే వరల్డ్ కప్ క్రికెట్ వరకూ ఆడే సత్తా ఉన్నా కోహ్లీ కోసం గొత్త త్యాగం చేశాడన్నారు భారత మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్. ఇటు భారత్‌కు ధోనీ కూల్ కెప్టెన్ అన్నారు అనురాగ్ ఠాకూర్. క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా సరైన నిర్ణయం తీసుకున్న ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాల్సిన సమయం అన్నారు. ధోనీ చిన్ననాటి కోచ్ చంచల్ భట్టాచార్య లాంటి వాళ్లయితే మిస్టర్ కూల్ నిర్ణయం న్యూఇయర్ గిఫ్ట్ అంటూ అభివర్ణించారు.
ఇటు బాలీవుడ్ ప్రముఖులు ధోనీ నిర్ణయానికి ఫిదా అయిపోయారు. అతడి బయోపిక్‌లో టైటిల్ రోల్ చేసిన సుశాంత్ అయితే మహీ లాంటి కెప్టెన్ ఎవరూ లేరనేశాడు. అనుపమ్ ఖేర్ ఇర్ఫాన్ ఖాన్, రణదీప్ హుడా లాంటి వారు ధోనీ డెసిషన్‌పై ట్వీట్స్ పెట్టారు. ఇటు కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించగానే సోషల్ మీడియా అంతా అతనిపై కామెంట్స్‌తో నిండిపోయాయి. డిఫరెంట్‌గా పోస్టులు చేసిన కొందరు ఈ నిర్ణయానికి ఎక్కువ హ్యాపీ అయ్యేది మాత్రం యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగే అంటూ చమత్కరించారు. ఇటు ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ధోనీ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడన్నారు. ధోనీ దూకుడు, గెలుపు కోసం ప్రయత్నాలే అతడిని గొప్ప కెప్టెన్ చేశాయన్నారు. మొత్తంగా తన నిర్ణయంతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించాడు జార్ఖండ్ డైనెమైట్.
Leave a Reply